శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్‌టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆగస్టు 18వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో చందానగర్ బస్ స్టాప్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ గుర్తు తెలియని వృద్ధుడిని పటాన్‌చెరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు (TS08Z0170) ఢీకొట్టింది. దీంతో ఆ వృద్ధుడి తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్‌టీసీ బస్సు డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ఆ వృద్ధుడి వయస్సు సుమారుగా 50 నుంచి 60 ఏళ్లు ఉంటుందని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.






