- పోక్సో చట్టం కింద సంచలన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఆశ చూపి ఓ చిన్నారిని తీసుకెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో నిందితుడికి న్యాయమూర్తి మరణశిక్షతోపాటు రూ.1వేయి ఫైన్ విధించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్‌లోని లంజీ ప్రాంతం బహేలా పీఎస్ పరిధిలోని కలిమటి అనే గ్రామానికి చెందిన దినేష్ కుమార్ ధర్నె (23) బ్రతుకు దెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి నార్సింగి పీఎస్ పరిధిలోని ఆర్యమిత్ర లేబర్ క్యాంపులో ఉంటూ అక్కడే సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే క్యాంపులో ఉంటున్న ఓ చిన్నారి (5)కి అతను 2017 డిసెంబర్ 12వ తేదీన చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి సమీపంలో ఉన్న కిరాణా షాపుకు తీసుకెళ్తున్నానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి అక్కడికి కొంత దూరంలో ఉన్న శ్రీ షిరిడీ సాయి ప్రేమ్ సమాజ్ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ పక్క భాగంలో పొదల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. తరువాత ఏమీ తెలియనట్లు లేబర్ క్యాంప్‌కు వచ్చాడు.
అయితే తమ కుమార్తె ఏమైందని అతన్ని ఆమె తల్లిదండ్రులు అడగ్గా.. తాను క్యాంపు వద్దే కొంత సేపటి క్రితమే ఆమెను దింపానని, బహుశా ఎక్కడో ఆడుకుంటూ ఉండవచ్చని చెప్పాడు. అయినప్పటికీ వారు నమ్మలేదు. అతని వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దినేష్ కుమార్ ను అరెస్టు చేసి వారు తమదైన శైలిలో విచారించారు. దీంతో అతను చేసిన నేరం అంగీకరించాడు. ఈ క్రమంలో పోలీసులు సంఘటన స్థలంలో పలు కీలక ఆధారాలను సేకరించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
అయితే అతను బెయిల్ మీద బయటకు వచ్చి సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతను కొంతకాలం పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడు. అయినప్పటికీ ప్రత్యేక బృందాల ద్వారా పోలీసులు అతనికోసం గాలించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ క్రమంలో అతనికి న్యాయమూర్తి బి.సురేష్ బాబు పోక్సో చట్టం కింద మరణశిక్ష విధించారు. రూ.1వేయి జరిమానా కూడా కట్టాలని తీర్పు ఇచ్చారు. దీంతో నిందితున్ని పోలీసులు జైలుకు తరలించారు.