సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని అందరూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని యూనిట్ హాస్పిటల్‌లో ఆయన కోవిడ్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలను సురక్షితంగా ఉంచిన ప్రతి ఫ్రంట్ లైన్ వారియర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కేవలం ఏడాది సమయంలోనే ప్రజలకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చినందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కంపెనీలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. త్వరలోనే కరోనా పూర్తిగా అంతం అవుతుందని అన్నారు. భారత్ నుంచి రెండు కరోనా వ్యాక్సిన్లను ఇప్పటికే 14 దేశాలకు ఎగుమతి చేశారని, ఇది అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో సైబరాబాద్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది మొత్తం 7వేల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌తోపాటు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ సీఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు, ఏడీసీపీ అడ్మిన్ లావణ్య ఎన్‌జేపీ, ఇతర పోలీసు అధికారులు టీకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సృజన, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రామి రెడ్డి, డాక్టర్ ప్రకాష్, ఆర్ఐలు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.