మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారంఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ లోని హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉండే జె.శివాజీ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలు సిద్దు (13), శితి విద్యానికేతన్ (10)లతో కలిసి జీవిస్తున్నాడు. కాగా ఈ నెల 1వ తేదీన ఉదయం అతను నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాడు. తన పిల్లలతో కలిసి అల్పాహారం తిన్నాడు. అనంతరం నిద్రకు ఉపక్రమించాడు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు లేచి చూడగా కుమారుడు సిద్దు కనిపించలేదు. బయటకు ఆడుకునేందుకు వెళ్లి ఉంటాడని అతను భావించి విధి నిర్వహణకు వెళ్లిపోయాడు. తరువాత అతని భార్య ఇంటికి వచ్చి చూడగా అప్పటికీ సిద్దు రాలేదు. దీంతో ఆమె తన భర్త శివాజీకి విషయం తెలియజేసింది. ఈ క్రమంలో వారు సిద్దు కోసం అన్ని చోట్లా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.