- రూ.30 లక్షల విలువైన 113 ఫోన్లు స్వాధీనం
- నిందితులు రిమాండ్‌కు తరలింపు
- ముంబైలో నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని ఎలక్ట్రానిక్స్ షోరూం రిలయన్స్ డిజిటల్‌లో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనలో నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్ ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
గత నెల 14వ తేదీన మియాపూర్‌లోని రిలయన్స్ డిజిటల్ షోరూం మేనేజర్ ఎండమూరి భాస్కర్ స్టోర్ లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందు రోజు రాత్రి 11.20 గంటలకు షోరూంను వారు మూసి ఇంటికి వెళ్లగా.. 14న ఉదయం 4.30 గంటలకు అతనికి ఫోన్ కాల్ వచ్చింది. షోరూం షటర్లను ఎత్తి అందులో ఉన్న 119 ఫోన్లను దొంగలు చోరీ చేసినట్లు గుర్తించాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను ముంబైలో అక్కడి పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. నిందితులను ముంబైకి చెందిన మహమ్మద్ తబ్రెజ్ దావూద్ షేక్ (38), ఫర్హాన్ ముంతాజ్ షేక్ (33), రషీద్ మహమ్మద్ రఫీక్ షేక్ (29), మహమ్మద్ సుఫియన్ షేక్ అలియాస్ సుబ్రతోదాస్ అలియాస్ బగ్వా అలియాస్ మంగు (24), రాజు (49)గా గుర్తించారు. ఈ క్రమంలో వారి నుంచి రూ.30 లక్షల విలువైన 113 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు.
కాగా నిందితులు ఐదుగురు గతంలోనూ అక్కడ ఇలాంటి నేరాలే చేసేవారు. ముంబైలో మళ్లీ నేరాలు చేస్తే దొరికిపోతామని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఇలాగే షోరూంల షటర్లను ఎత్తి వాటిల్లో ఉన్న ఫోన్లను దొంగతనం చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వారు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఒక షాపులో 80 సెల్‌ఫోన్లు, గుజరాత్‌లోని సూరత్‌లో మరో షాపులో 180 సెల్ ఫోన్లు, హైదరాబాద్ పంజగుట్టలోని ఓ షటర్ ఎత్తి రూ.4వేల నగదును, పటాన్‌చెరులో ఒక వైన్‌షాప్ షటర్ ఎత్తి 3 లిక్కర్ బాటిల్స్, రూ.700 నగదును, మహారాష్ట్ర షోలాపూర్‌లో మరొక షటర్‌లో రూ.1,82,500 నగదును దొంగిలించారు. ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధుల్లోనూ వారిపై కేసులు నమోదయ్యాయి.
కాగా వారు ముంబైలో ఓ ఇన్నోవా కార్ (MH04EJ-3339)ను అద్దెకు తీసుకుని నవంబర్ 13వ తేదీన రాత్రి హైదరాబాద్‌లోని మియాపూర్‌కు వచ్చారు. అక్కడ ఏపీ-09 పేరుతో కార్ నంబర్ ప్లేట్‌ను మార్చారు. అనంతరం రిలయన్స్ డిజిటల్‌లో 119 సెల్‌ఫోన్లను చోరీ చేసి అక్కడి నుంచి తిరిగి ముంబైకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారును గుర్తించారు. దాని నంబర్ ప్లేట్ నకిలీదని నిర్దారించారు. అనంతరం కారు ముంబై వెళ్లిందని తెలుసుకుని పోలీసులు కూడా ముంబై వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో సైబరాబాద్ పోలీసులు ఆ ఐదుగురు నిందితులను పట్టుకుని నగరానికి తీసుకువచ్చారు. కాగా నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించి తక్కువ వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ వీసీ సజ్జనార్ అభినందించారు.