శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజాంపేట హైటెన్షన్ రోడ్డు ఏఎస్సార్ రాజు నగర్ రోడ్డు నంబర్ 3లో నివాసం ఉంటున్న దోనిపాలి నాగరాజు (35) స్థానికంగా ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జూలై 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం (యూపీ65డబ్ల్యూ5077)పై మియాపూర్‌లో ఉన్న కల్వరి టెంపుల్ గోపాల్ నగర్‌లో ఓ వ్యక్తికి చెందిన రక్త నమూనాను తీసుకునేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శాంపిల్ తీసుకుని ఇంటికి బయలు దేరగా సాయంత్రం 4:10 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా గోపాల్ నగర్ రోడ్డు నం 6బి వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ స్కూల్ బస్ డ్రైవర్ నాగరాజు వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి అతని బార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూల్ బస్ (టీఎస్07యూఎం2770) డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా బస్సును నడిపించడంతోనే అదుపు తప్పి నాగరాజు వాహనాన్ని ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు





