నమస్తే శేరిలింగంపల్లి: కుటుంబ కలహాలు, ఇతరత్రా కారణాలతో ముగ్గురు వ్యక్తులు అదృశ్యమైన సంఘటనలు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
భర్తతో గొడవపడి…
భర్తతో గొడవపడి సోదరుని ఇంటికి వచ్చి ఓ మహిళ అదృశ్యమైంది. సాడేపల్లి స్వాతి తన భర్త ముఖేష్ తో గొడవపడి ఈ నెల 11 వ తేదీన యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామం నుంచి చందానగర్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న తన సోదరుడు కుమ్మం సాయికుమార్ ఇంటికి స్వాతి తన మూడేళ్ల కూతురు గౌతమితో కలిసి వచ్చింది. ఈ నెల 19వ తేదీన సాయికుమార్ ఇంటి నుంచి స్వాతి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతకగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వాకింగ్ కోసమని వెళ్లిన తండ్రి..
వాసుదేవ్ విశ్వనాథ్ దూసే అనే వ్యక్తి ఎంఐజీ-106 లో తన కూతురు స్వాతి ప్రశాంత్ పాటిల్ ఇంటి నుంచి ఈ నెల 25 న పీజేఆర్ స్టేడియంలో వాకింగ్ కోసమని వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో అతని కుమారుడు వైభవ్ వాసుదేవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
భర్త వేధింపులు భరించలేక…
భర్త వేధింపులు భరించలేక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. డి. ప్రణయ్, శిరీష ఏడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఇద్దరు భార్యభర్తలు చందానగర్ గౌతమి నగర్ రాఘవేంద్ర అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25 న ప్రణయ్ ఉద్యోగానికి వెళ్లి వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. భార్య శిరీషకు ఫోన్ చేయగా స్విచ్ ఆప్ ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా టేబుల్ పై తన భార్య శిరీష రాసిపెట్టిన ఉత్తరం, నిశ్చితార్థం ఉంగరాన్ని గమనించాడు. ఇంట్లో నుంచి పట్టు చీరలు, 8 తులాల బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. బంధువుల వద్ద, స్నేహితుల వద్ద ఆచూకీ కోసం ప్రయత్నించగా ఆచూకీ లభించకపోవడంతో భర్త ప్రణయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చందానగర్ పోలీసులు వెల్లడించారు. ఆయా ఘటనల్లో అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పోలీస్ స్టేషన్ లో, 040- 27853911, 9490617118, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 100, 040 27853408 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.