భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. అయితే సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రేక్షకులు ఇండియన్ ప్లేయర్లను దూషించారు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో మైదానంలో ఉన్న సిరాజ్, బుమ్రాలు కెప్టెన్ అజింక్యా రహానెకు విషయాన్నితెలపగా.. అందరూ కలిసి ఈ విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకువెళ్లారు. మ్యాచ్ అనంతరం వారు రిఫరీకి కూడా ఫిర్యాదు చేశారు.
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి స్టాండ్స్‌లో ఉన్న కొందరు ప్రేక్షకులు భారత ఆటగాళ్ల పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ దూషించారు. అయితే మరుసటి రోజు కూడా టీ బ్రేక్ సమయంలో కొందరు ప్రేక్షకులు భారత ఆటగాళ్లను దూషించారు. దీంతో విషయం సీరియస్ అయింది. అయితే ఈ విషయంపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం నిజమేనని నిర్దారించింది. ఈ మేరకు ఐసీసీకి క్రికెట్ ఆస్ట్రేలియా నివేదికను పంపించనుంది.
అయితే దూషణలు చేసిన సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుల వివరాలను తెలుసుకుంటున్నామని, వారు ఎవరనేది గుర్తిస్తున్నామని, ఆ విషయం స్పష్టమైతే సదరు ప్రేక్షకులను ఇకపై స్టేడియంలలోకి అనుమతించకుండా నిషేధం విధిస్తామని, అలాగే వారిని పోలీసులకు అప్పగిస్తామని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా తెలియజేసింది. అయితే ఆ ప్రేక్షకులు కేవలం దూషణలు మాత్రమే చేశారని, దూషణలు చేస్తున్నట్లు అసభ్యకర ప్రవర్తన చేయలేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.