నమస్తే శేరిలింగంపల్లి: కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్ కమీషనర్ వి.సి.సజ్జనార్ అన్నారు. ఆదివారం సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీవోలకు చెందిన వాలంటీర్లతో కలిసి అత్యవసర స్థితిలో ఉన్నకోవిడ్ రోగులకు ప్లాస్మా అందించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న వాలంటీర్లను అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో యువకులు పెద్దఎత్తున సమాజిక సేవలో పాల్గొనడం అభినందనీమని తెలిపారు. ప్రతీఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలను పాటించి మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం కమీషనరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాదాపు 6వేల మంది ప్లాస్మా దాతలతో 10వేల యూనిట్ల ప్లాస్మా యూనిట్లను అందించగలిగామని, కరోనా వేవ్-2 సమయంలో 2400 మంది రోగులకు ప్లాస్మా అందేలా చూడగలిగామని తెలిపారు. కరోనా నుండి కోలుకున్న వారంతా ఇతర రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌లో సేవలందిస్తున్న ఎస్సిఎస్సి ప్రధానకార్యదర్శి క్రిష్ణ ఎదుల, ఎసిపి హనుమంతరావుతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.