చందానగర్ డివిజన్ ను చేజిక్కించుకునేదెవరు..?

  • సిట్టింగ్ కార్పొరేటర్ ను కాదని డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడికి టికెట్
  • ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ ల హోరాహోరీ పోరు
  • కీలకం కానున్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు

శేరిలింగంపల్లి గుండెకాయగా పేరుగాంచిన చందానగర్ డివిజన్ ఈ ప్రాంతపు తెలంగాణ ఉద్యమానికి వేదిక. ఒకప్పుడు ఈ ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోల్చితే వ్యాపార వాణిజ్యాలలో మెరుగ్గా ఉండేది. అన్ని రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రధాన కార్యక్రమాలు చందానగర్ లోనే జరపడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ డివిజన్ లో మెజారిటీ వాటా బస్తీలదే కావడంతో ఎన్నికల్లో పాల్గొనేవారిలో మాస్ ఓటర్లే ఎక్కువ. కొంత మేర సెటిలర్ల ప్రభావం ఉన్న ప్రాంతాలు కూడా ఈ డివిజన్ లో ఉన్నాయి. ఈ డివిజన్ పరిధిలో ముఖ్యంగా తారానగర్, రెడ్డి కాలనీ, భవానీపురం, జవహర్ నగర్, వేముకుంట, దీప్తిశ్రీనగర్, ఇక్రిశాట్ కాలనీ, ఇందిరా నగర్, వెంకటేశ్వర కాలనీ, చందానగర్, శంకర్ నగర్, తారనగర్ వీకర్ సెక్షన్, శివాజీ నగర్, శిల్ప ఎంక్లేవ్, గౌతమినగర్, కైలాష్ నగర్, పద్మజ కాలనీ, అన్నపూర్ణ ఎంక్లేవ్, ఫ్రెండ్స్ కాలనీ, కెఎస్ఆర్ కాలనీ,  శుభోదయ ఎంక్లేవ్, రాజేందర్ రెడ్డి నగర్, చందానగర్ ఎస్ సి బస్తి, పిఎ నగర్ తదితర ప్రాంతాలున్నాయి. ప్రస్తుత ఓటర్ల సంఖ్య 60111

చందానగర్ డివిజన్ ముఖచిత్రం

గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో డివిజన్ నుండి 23065 మంది ఓటు హక్కు వినియోగించుకోగా టిఆర్ఎస్ అభ్యర్థి బొబ్బ నవత రెడ్డి 11411 ఓట్లతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టిడిపి అభ్యర్థి వసుంధర 8580 ఓట్లతో రెండవ స్థానంలో నిలువగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎం.అనిత 2948 ఓట్లతో మూడవ స్థానం దక్కించుకున్నారు.

డివిజన్ నుండి బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

రెడ్డి మంజుల రఘునాథ్ రెడ్డి(టిఆర్ఎస్)

రెడ్డి మంజుల రఘునాథ్ రెడ్డి

చందానగర్ డివిజన్ రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న రెడ్డి రఘునాథ్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చాల కాలం పాటు డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసాడు. మున్సిపాలిటీ సివిల్ కాంట్రాక్టర్ గా పని చేయడంతో పాటు స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటంతో డివిజన్ పై మంచి పట్టు సాధించాడు. గత జిహెచ్ఎంసి ఎన్నికల అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరిన రఘునాథ్ రెడ్డి ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. పార్టీలో టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఈ ప్రాంతపు ఆశావహులను ఏకం చేసి ఇక్కడి సిట్టింగ్ కార్పొరేటర్ ను కాదని పార్టీ టికెట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సతీమణి మంజుల రఘునాథ్ రెడ్డి ని టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టాడు. డివిజన్ టీఆరెస్ ముఖ్య నాయకుల మద్దతు, టిఆర్ఎస్ పార్టీ ఛరిష్మాతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాడు.

కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి(బీజేపీ)

కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి కోడలు సింధు రఘునాథ్ రెడ్డి. చందానగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పనిచేశాడు. అనంతరం బీజేపీలో వార్డ్ అధ్యక్షుడిగా మొదలుకొని అనేక పదవుల్లో కొనసాగి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనంకోసం సంస్థ ద్వారా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల పరిరక్షణకు పోరాడటం చేశాడు. దీంతో పాటు తాను నివాసముండే గౌతమీనగర్ కాలనీ సంక్షేమ సంఘంలో ముఖ్య సలహాదారుడిగా ఉంటూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డివిజన్ నుండి టికెట్ రేసులో ఉన్నశేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డితో పోటీ పడి పార్టీ టికెట్ సాధించడంలో సక్సెస్ అయ్యాడు భాస్కర్ రెడ్డి. డివిజన్ మహిళలకు రిజర్వ్ ఐన కారణంగా తన ప్రతినిధిగా కోడలు సింధు రఘునాథ్ రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపాడు. బీజేపీ అనుకూల పవనాలు, స్థానిక యువత, వివిధ సంఘాల సహకారం, స్థానికంగా గుర్తింపుతో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

అక్సారి బేగం(కాంగ్రెస్)

అక్సారి బేగం

దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ అనుచరులలో ఒకడైన శేరిలింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిజామొద్దీన్ కోడలు అక్సారి బేగం. నిజామొద్దీన్ స్థానికంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ చందానగర్ స్ట్రీట్ వెండర్స్ అసోసియషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి స్థానికంగా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా పని చేస్తూ మైనారిటీ నాయకుడిగా పేరుగాంచాడు. ఈ ప్రాంతంలోని మెజారిటీ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడినప్పటికీ పార్టీ జెండా నే నమ్ముకుని నియోజకవర్గ ఇంచార్జ్ రఘునందన్ రెడ్డి సహకారంతో ఎన్నికల బరిలో దిగాడు. నిజామొద్దీన్ కోడలు అక్సారి బేగం ను తన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నాడు. పద్మశాలి సామజిక వర్గానికి చెందిన మౌనిక జెల్ల డివిజన్ లో పలు సామాజిక కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ స్థానికంగా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరితో పాటు , ఎంసిపిఐ యు అభ్యర్థి గా పుష్ప అంగడి, స్వతంత్ర అభ్యర్థి గా పద్మావతి లు బరిలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ మాస్, మైనారిటీ ఓట్లను కొల్లగొడితే…

శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో ఈ ఒక్క డివిజన్ నుండే సిట్టింగ్ కార్పొరేటర్ ను పక్కన పెట్టి టిఆర్ఎస్ అధిష్టానం కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయించింది. టీఆరెస్ పార్టీ కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలందించిన బొబ్బ నవత రెడ్డి ఎన్నికల క్షేత్రంలో లేకపోవడం ఆ పార్టీకి కొంత నష్టాన్ని కలిగించే అంశం. ఎన్నికల ప్రచారంలో సైతం నవత రెడ్డి ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకుల మద్దతుతో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. గత ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసి 8580 ఓట్లు సాధించిన ఉరిటి వసుంధర వెంకట్రావు తో పాటు మరికొందరు ముఖ్య నేతలు మంజుల రఘునాథ్ రెడ్డి శిబిరంలో చేరడంతో రాజకీయంగా బలపడ్డాడు. గ్రేటర్లో బీజేపీకి అనుకూల పవనాలు, స్థానిక యువత, పలువురు ఉద్యమకారులు, జనసేన పార్టీ నాయకుల అండదండలతో పార్టీ అభ్యర్థి సింధు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. మామ కసిరెడ్డి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న సింధు ప్రజా క్షేత్రంలో తొలిసారి దిగినప్పటికీ తన వాక్చాతుర్యంతో, చలాకీతనంతో స్థానిక ప్రజలను ఆకట్టుకున్నారు. రెండు పార్టీల నాయకులు విజయం తమనే వరిస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారంలో దూసుకుపోవడంతో మాస్, మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం బిజెపికి కలిసొచ్చే అంశంగా మారనుంది. డివిజన్ లో పోలింగ్ శాతం పెరిగినా బీజేపీ కి లాభం చేకూరనుంది. తాజా పరిస్థితుల ప్రకారం టీఆరెస్ బీజేపీ పార్టీలు పోటాపోటీగా విజయం కోసం పోరాడుతున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here