- అట్టహాసంగా దుర్గం చెరువు కేబుల్ వంతెన ప్రారంభం
- కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు మంత్రులు, ప్రముఖులు
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరవాసులు ఆతృతగా ఎదురుచూస్తున్న దుర్గం చెరువు కేబుల్ వంతెన ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. వంతెనపై ఏర్పాటు చేసిన ఎల్ ఈడి దీపాల కాంతులు, బాణసంచా వెలుగులతో దుర్గం చెరువు ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని(తీగల వంతెన)ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర సహాయమంత్రి శ్రీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు.
అనంతరం దుర్గం చెరువుకు వచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్ ను ప్రారంభించిన కేటీఆర్ మంత్రులతో కలిసి బోటింగ్ చేస్తూ కేబుల్ వంతెన అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో, వీడియో గ్యాలరీ ని మంత్రులు సందర్శించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ వంతెనకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించనుంది. వంతెన నిర్మాణంతో మాదాపూర్ ఐటీ కారిడార్ సరికొత్త శోభను సంతరించుకుంది.
ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ లు అరికెపుడి గాంధీ, కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ లతో పాటు స్థానిక కార్పొరేటర్లు హమీద్ పటేల్, సాయిబాబా, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, జానకి రామ రాజు, లక్ష్మీ బాయి, నవత రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కేబుల్ బ్రిడ్జి విశేషాలు మరోసారి మీకోసం…
- దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెన,ఆసియాలోనే రెండవది
- వంతెనవంతెన నిర్మాణ ఖర్చు 184 కోట్లు
- వంతెన పొడవు 735 మీటర్లు(పెద్దమ్మతల్లి ఎక్స్ప్రెస్ హైవే తో కలిపి)
- ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జిల్లో అత్యంత పొడవైన మెయిన్ స్పాన్ (233.85 మీటర్లు) ఇదే ప్రథమం.
- పర్యావరణ హితంగా రెండు పిల్లర్లతోనే నిర్మాణం
- వాహనాల గరిష్ట వేగ పరిమితి 35 కి.మీ.
- శని, ఆది వారాల్లో వాహనాల ప్రయాణం నిషేధం, సందర్శకులకు మాత్రమే ప్రవేశం.
- మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు గణనీయంగా తగ్గిన దూరం