- సెల్ టవర్ సంస్థకు నోటీసులు జారీ చేసిన బల్దియా, విద్యుత్ అధికారులు
నమస్తే శేరిలింగంపల్లి: పార్కు స్థలాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టకుడదని ప్రభుత్వ జీవోలు పేర్కొంటున్నా… హైకోర్టు, సుప్రిం కోర్టులు హెచ్చరిస్తున్నా ఆక్రమణల తంతు ఆగడం లేదు. పార్కు స్థలాల్లో ఆక్రమ నిర్మాణాలకు తోడు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా సెల్ టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మియాపూర్ లోని ఓ పార్కులో ఓ సంస్థ సెల్‌ఫోన్ టవర్ నిర్మాణం చేపట్టింది. ఐతే పార్క్‌లో వెలిసిన సదరు సెల్ టవర్‌ను తొలగించాలని కోరుతూ వినయ్ వంగల అనే ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదుపై స్పందించిన బల్దియా, ట్రాన్స్ కో అధికారులు సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు.
మియాపూర్ మాతృశ్రీనగర్ లోగల పబ్లిక్ పార్కులో బిఎస్ఎన్ఎల్ సంస్థ సెల్‌టవర్ ను ఏర్పాటు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ వినయ్ వంగల జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన డీసీ సదరు అంశంపై టౌన్‌ప్లానింగ్ అధికారులను విచారణకు ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల విచారణలో పార్కు స్థలంలోనే సెల్ టవర్ ఉందని నిర్ధారణ జరగడంతో సదరు సంస్థకు సెల్ టవర్‌ను తొలగించుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులపై సెల్ టవర్ సంస్థ అసలు స్పందించలేదు. దీంతో ఫిర్యాదుదారు సదరు అంశాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చందానగర్ సర్కిల్ 21 ఉపకమిషనర్ స్పందిస్తూ ఈ సారి విద్యుత్ అధికారులకు లేఖ రాశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మాతృశ్రీనగర్ పార్కులో వెలసిన సెల్‌టవర్కు సరఫరా చేస్తున్న విద్యుత్‌ను వెంటనే నిలిపివేయాలని ఈ నెల 7న టీఎస్ఎస్‌పీడీసీఎల్ డిప్యూటీ ఇంజనీర్‌కు లేఖ రాశారు.
చర్యలు తీసుకుంటాం…
జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ఉపకమిషనర్ నుంచి లేఖ అందింది. మాతృశ్రీనగర్ పార్కులో వెలిసిన సెల్‌టవర్‌కు విద్యుత్ సరఫర నిలిపివేతపై సదరు బిఎస్ఎన్ఎల్ సంస్థకు నోటీసులు జారీచేయమని స్థానిక విద్యుత్ అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ సంస్థ స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం.
గోపాల కృష్ణ, డీఈ,
గచ్చిబౌలి, టీఎస్ఎస్‌పీడీసీఎల్.
ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది…
పార్కు స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ప్రభుత్వ నిబంధనలు పేర్కొంటున్నాయి. జీఓ నెంబర్ 96, అదేవిధంగా 72 (ఎంఏ ఆండ్ యూడీ) ప్రకారం పార్కులలో ఎలాంటి ఆక్రమణలు లేదా నిర్మాణాలు చేపట్టినా చట్టరిత్యా నేరం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వినయ్ వంగల,
సామాజిక కార్యకర్త.