నమస్తే శేరిలింగంపల్లి: సకల దేవతలకు తల్లిగా బావించే గోమాతకు పుట్టెడు కష్టం వచ్చి పడింది. భెల్ ఎంఐజీలోని ఇంటి నెంబర్ 1235 ముందు ఒక ఆవు రెండు రోజుల క్రితం వచ్చి రోడ్డు పక్కన కూర్చుంది. అక్కడి నుంచి లేచి నడిచే పరిస్థితి లేదు. ఆవు చెవికి ఉన్న ఓ బ్యాడ్జీపై 380111, 713354 నెంబర్లతో కూడిన ఓ బార్‌కోడ్ ఉంది. కానీ ఆవు ఎవరిది, ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలియని పరిస్థితి. దీంతో స్థానికుల మనసు చలించి గోమాత ఆకలి, దాహార్తిని తీరుస్తున్నారు. కానీ ఆవుకు వచ్చిన ఇబ్బందిని తీర్చలేక సతమతమవుతున్నారు. ఐతే ఓ గోశాలలో పనిచేసే స్థానిక మహిళ ఆవును చూసి కడుపుతో ఉందని, లోపల బిడ్డ అడ్డం తిరిందని, వెంటనే వైద్యం చేయాలని సూచించింది. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు లేదా గోరక్షణ దళాలు సదరు ఆవును కాపాడాలని వేడుకుంటున్నారు.
ఆవుకు వైద్యం అందిస్తాం: శేరిలింగంపల్లి జోన్ వీఓ డాక్టర్ నిజాం
నమస్తే శేరిలింగంపల్లి సదరు గోమాత అవస్థను శేరిలింగంపల్లి జోన్ వెటర్నరీ అధికారి డాక్టర్ నిజాం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆవుకు వైద్యం అందేలా చూస్తామని అన్నారు. ఎల్‌బీ నగర్‌లోని పీపుల్ ఫర్ అనిమల్(పీఎఫ్ఏ) ఎన్‌జీఓ సంస్థ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు.
జీహెచ్ఎంసీ యానిమల్ రెస్కూ సెంటర్‌కు తరలిన ఆవు…
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ వెటర్నరీ విభాగం రెస్కూ టీం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆవును అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ ఫతుల్ల గూడాలోని జీహెచ్ఎంసీ యానిమల్ రెస్కూ సెంటర్‌కు తరలిస్తున్నట్టు వీఓ డాక్టర్ నిజాం తెలిపారు. అక్కడే ఆవుకు వైద్యం అందిస్తారని, ఆవు చెవిపై ఉన్న బార్‌కోడ్ సహకారంతో ఆవు యజమానికి సమాచారం అందిస్తారని తెలిపారు.