నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం చేస్తున్న కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ నాయక్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఎంసిపిఐయు గ్రేటర్ ప్రధానకార్యదర్శి తుకారం నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మియపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండలో అంబేద్కర్ విగ్రహం దగ్గర గిరిజన సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో సునీల్ నాయక్ ఆత్మకు శాంతి చేకురాలని కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా తుకారాం నాయక్ మాట్లాడుతూ సునీల్ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి ఎక్స్గ్రేషియా , వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగుల భవితవ్యాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో గోపి నాయక్, మధునాయక్, సీతారాం నాయక్, ఆంజనేయులు, రవి , తిరుపతినాయక్ , రతన్ నాయక్, నరసింహ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.