నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు ఆధ్వర్యంలో విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. జేపీనగర్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడని అన్నారు. ఆనాటి స్వాత్యంత్ర పోరాట ఉద్యమ సమయంలో గిరిపుత్రుల్లో చైతన్యం నింపి విప్లవాగ్ని రగిలించి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్, మహేష్ యాదవ్,రామకృష్ణ, విజయేందర్, ప్రభాకర్, వినోద్, గణేష్, పృథ్వి కాంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
