నమస్తే శేరిలింగంపల్లి: కల్లు తాగేందుకు దుకాణానికి కూతుళ్లతో కలిసి వెళ్లిన తల్లి మత్తులో ఉండగా మూడేళ్ళ చిన్నారిని మరో మహిళ అపహరించింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన విర్ నుష్ చందానగర్ హుడా కాలనీలో గుడిసెలు వేసుకుని భార్య రవిత, కూతుర్లు అదీనీ సెరి(6) సదీనీ సెరి(3) లతో కలిసి నివాసం ఉంటున్నారు.
కాగా గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రవిత తారానగర్ కల్లు దుకాణానికి వెళ్లింది. పుష్టిగా కల్లు సేవించి దుకాణం ఆవరణలోనే గాఢ నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని మహిళ ఆమె చిన్నకూతురు సదీనీని ఎత్తుకుని వెళ్లిపోయింది. నిద్ర నుండి మేల్కొన్న రవితకు పాప కనిపించకపోవడంతో భర్తకు తెలుపగా చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. సిసి కెమెరాల ఆధారంగా చిన్నారిని ఎత్తుకుపోయిన మహిళను పాపిరెడ్డి కాలనీకి చెందిన జంషేడ్ లక్ష్మీగా గుర్తించిన పోలీసులు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి చిన్నారిని స్వాధీనం చేసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మిని రిమాండుకు తరలించారు. కేసును 20 గంటల్లోనే ఛేదించడంలో చొరవ చూపిన ఎస్ఐ రాములు, క్రైమ్ సిబ్బంది జానకిరామ్, సాదిక్, సీసీ కెమెరా నిపుణుడిని క్యాస్ట్రో అభినందించారు.