శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): విరాళాలను సేకరించడం ద్వారా అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రామ మందిరం నిర్మాణానికి కావలసిన నిధులు సమకూర్చుకునేందుకు తమ ప్రచారాన్ని 50 కోట్ల మంది ప్రజల వద్దకు తీసుకువెళతామని, ఇంత పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు అనుసంధానమయ్యే బృహత్ కార్యక్రమాన్ని ప్రపంచ చరిత్రలో ఎవరూ చూసి ఉండరని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి ఇచ్చే విరాళాలను ‘చందాలు’ అని అనకుండా ‘రామ మందిర నిధి సమర్పణ ప్రచారం’ అని పిలుస్తారు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తితో, అంకితభావంతో విరాళాలు సమర్పించుకుంటారు. ఈ ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామం హనుమాన్ ఆలయంలో స్థానిక ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకుడు కర్చేర్ల ఎల్లేష్, డివిజన్ బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి శేరిలింగంపల్లిలో నిధులను సమీకరించే విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.






