మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాకు సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపు వారు తమపై పాల్పడుతున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ తండా వాసులు ఆదివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండాలో తాము గత 50 సంవత్సరాల నుంచి ఉంటున్నామని, సుమారుగా 800 కుటుంబాల వాసులం జీవిస్తున్నామని తెలిపారు. అందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని తెలిపారు. కాగా తండాకు సమీపంలో 2016 నుంచి సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారని తెలిపారు. క్యాంప్‌కు చెందిన వారు తమ తండాలో తిరుగుతూ స్థానికులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని, పలు సందర్భాల్లో తండా వాసులపై భౌతిక దాడులు కూడా చేశారని వాపోయారు. కనుక ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను అక్కడి నుంచి తొలగించేలా చూడాలని కోరారు. అలాగే తండాలో ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి కట్టించి ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హన్మ నాయక్, శంకర్ నాయక్, సీతారాం నాయక్, కృష్ణ నాయక్, చందు యాదవ్, మధు నాయక్, రెడ్యానాయక్, రవి కుమార్, రత్న కుమార్, సుధాకర్, నర్సింహా, అబ్రహం, రాజు, లక్ష్మణ్, తండా వాసులు పాల్గొన్నారు.





