- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సైబరాబాద్ పోలీసుల హెచ్చరికలు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): జనాలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ ఏదో ఒక నూతన పద్ధతిలో మోసాలకు పాల్పడుతూ జనాల డబ్బును కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్‌ను కేంద్రం అతి త్వరలో అందుబాటులోకి తేనుండడంతో ఈ వ్యాక్సిన్ పేరిట ఇప్పుడు కొందరు దుండగులు జనాలను దోపిడీ చేస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ కొందరు జనాలకు ప్రస్తుతం ఫోన్ కాల్స్ చేస్తున్నారు. జనాలకు సంబంధించిన ఆధార్, ఈ-మెయిల్ వివరాలను అడుగుతున్నారు. దీంతో నిజమే అని నమ్ముతున్న కొందరు తమ ఆధార్, ఇతర వివరాలను మోసగాళ్లకు అందజేస్తున్నారు. వాటి ద్వారా మోసగాళ్లు ఆధార్‌తో బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఓటీపీలను కూడా చెప్పాల్సిందిగా జనాలను అడుగుతున్నారు. వారు ఓటీపీలను చెబుతున్నారు. తరువాత కొంత సేపటికి జనాల బ్యాంకుల్లో డబ్బు ఖాళీ అవుతోంది. ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
కాగా కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారు. ఈ విషయమై వారు ప్రజలకు పలు సూచనలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ పేరిట ఎవరైనా ప్రజలకు చెందిన వ్యక్తిగత వివరాలను అడిగితే చెప్పకూడదని వారు హెచ్చరించారు.
* కోవిడ్ వ్యాక్సిన్ కోసమంటూ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాల్ చేస్తే స్పందించకూడదు.
* ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదు.
* క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తెలియని వారికి చెప్పకూడదు.
కోవిడ్ వ్యాక్సిన్ పేరిట జరుగుతున్న మోసాల బారిన పడకూడదని ప్రజలను సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఇదే విషయమై ఫోన్ కాల్స్ చేస్తే వెంటనే అప్రమత్తం కావాలని, అలాంటి కాల్స్ గురించిన వివరాలను వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి తెలపాలని అన్నారు. లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 లేదా క్రైమ్ పీఎస్ నంబర్ 9490617320 కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.





