సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ నెలలో మొత్తం 2351 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 27వ తేదీల మధ్య కమిషనరేట్ పరిధిలోని పలు చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మొత్తం 2,351 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు.
కాగా కేసులు నమోదు కాబడిన వారిలో యువత ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. మొత్తం 2351 మందిలో 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారు ఇద్దరు, 18 నుంచి 20 ఏళ్ల వారు 38 మంది, 21 నుంచి 30 ఏళ్ల వారు 1027 మంది, 31 నుంచి 40 ఏళ్ల వారు 896 మంది, 41 నుంచి 50 ఏళ్ల వారు 303 మంది, 51 నుంచి 60 ఏళ్ల మధ్య వారు 73 మంది, 61 నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు 12 మంది ఉన్నారన్నారు. అలాగే మొత్తం కేసుల్లో 2 వీలర్లకు సంబంధించి 1763, 3 వీలర్లకు చెందినవి 102, 4 వీలర్‌కు చెందినవి 480, లారీలకు సంబంధించినవి 6 ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఈ తనిఖీలు చేపడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులను నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై మోటారు వాహనాల చట్టం 1988 లోని సెక్షన్ 185 ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మొదటి సారి ఈ ఉల్లంఘనకు పాల్పడితే రూ.10వేల జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, అదే రెండో సారి పట్టుబడితే రూ.15వేల జరిమానా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ఈ క్రమంలో మొదటి సారి నిబంధనలను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలల వరకు, రెండోసారి అయితే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుందన్నారు.
మద్యం తాగి వాహనాలను నడిపే వారు రహదారులపై ప్రయాణించే ఇతర వాహనదారులకు, పాద చారులకు ముప్పును కలిగిస్తున్నందున వారి కోసం ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడే వారి వివరాలను వారు పనిచేసే కంపెనీలకు, విద్యార్థులైతే విద్యా సంస్థలకు, ప్రభుత్వ ఉద్యోగులు అయితే శాఖాధిపతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు.
కాగా మద్యం తాగి వాహనం నడపడం ద్వారా వ్యక్తుల మరణానికి కారణమయ్యే (వారి వాహనంలో ప్రయాణించినా లేదా ఏదైనా మూడవ పార్టీ వాహనమైనా) వారిపై culpable homicide not amounting to murder 304 పార్ట్ సెక్షన్, ఐపీసీ ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష (సాధారణ లేదా కఠినమైన) విధించబడుతుందన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఎట్టి పరిస్థితిలోనూ మద్యం సేవించి వాహనాలను నడిపించరాదని, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు పౌరులు పోలీసులతో సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.