మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని శిల్పారామంలో కొనసాగుతున్న ఆలిండియా క్రాఫ్ట్స్ మేళాలో సందర్శకులు గురువారం సందడి చేశారు. శిల్పారామంలో మొత్తం 400 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా వాటిల్లో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు తమ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచారు. కాగా స్టాల్స్‌లో గుజరాత్ డెకొరేటివ్ వాల్ హ్యాంగింగ్స్, పిల్లో కవర్లు, బాగ్స్, క్రోషియా వర్క్ టేబుల్ క్లోత్స్, బంజారా వర్క్ బ్యాగ్స్, డోర్ మ్యాట్స్, రాజస్థానీ పెయింటింగ్ వర్క్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
గురువారం సాయంత్రం శిల్పారామం ఆంఫి థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా రమణి సిద్ధి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఎంతగానో అలరించింది. ఆనంద గణపతి, జయము జయము, రామాయణ శబ్దం, శివ పాద మంజీరా నాదం, కొలువైతి వారంగా సాయి, బృందావన నిలయేహ్, భామాకలాపం, కృష్ణం కలయ సఖి అంశాలను అన్షు, మహిత, ప్రియవర్షిణి, సరిత, సింధు, చంటి, హాసిని, దినకర్, మీనా, పుష్పలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.