మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరంలో డాక్టర్లుగా చెలామణీ అవుతున్న నకిలీ వైద్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య పట్టణ గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని మియాపూర్‌లో మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్బంగా కన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారులు నకిలీ డాక్టర్లను శిక్షిస్తామని చెప్పి కొందరు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులను టార్గెట్‌గా చేసుకుని వారిని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికారులు ఇలా చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై క్షక్ష సాధింపు చర్యలను మానుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి అర్హత పత్రాలను అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి ఇ.రమేష్, వైద్యులు పీ శ్రీనివాస్, చంద్రశేఖర్, మహమ్మద్, నరేష్ పాల్గొన్నారు.





