శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనగూడ డివిజన్‌లోని హుడా కాలనీ-పాపిరెడ్డి కాలనీ మధ్య ప్రజల రాకపోకలకు కీలకంగా ఉన్న రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి వర్షపు నీటితో నిండిపోవడంపై బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. వర్షాకాలం వచ్చిన ప్రతిసారి అండర్‌పాస్ నీటమునిగిపోతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా వర్షపు నీటితో నిండిన అండర్‌పాస్‌లో స్థానిక చిన్నారులతో కలిసి పేపర్ పడవలను వదిలి నిరసన తెలిపారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు మొద్దునిద్ర వీడి తక్షణ చర్యలు చేపట్టి, అండర్‌పాస్‌లో నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి వజీర్ రాజు ముదిరాజ్, సీనియర్ నాయకులు దేవేందర్ రావు, వెంకటేష్ ముదిరాజ్, అమర్నాథ్ రెడ్డి, పాలం శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్, కాలనీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.






