సైబరాబాద్ కార్పొరేషన్ సమావేశం.. కీలక అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్..

శేరిలింగంప‌ల్లి, జూన్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) జయేష్ రంజన్ అధ్యక్షతన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) 5వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని క‌మిష‌న‌ర్ సృజ‌న ఆధ్వ‌ర్యంలో నిర్వహించారు. సమావేశంలో నగర మౌలిక వసతులు, క్రీడా అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, పౌర సేవలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శేరిలింగంపల్లి జోన్‌లో ఐదు ప్రాంతాల్లో సీఎస్‌ఆర్, పీపీపీ లేదా ఇతర విధానాల ద్వారా మల్టీ స్పోర్ట్స్ మౌలిక వసతుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమీన్‌పూర్ మోడల్ రైతు బజార్‌లో 45 దుకాణాల కేటాయింపుతోపాటు ఖాళీగా ఉన్న షాపుల కోసం తిరిగి టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు.

అలాగే అమెజాన్ సీఎస్‌ఆర్ సహకారంతో గిగ్, డెలివరీ వర్కర్ల కోసం ప్రాజెక్ట్ ఆశ్రయ్ – రెస్ట్ అండ్ వెల్‌నెస్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. మాదాపూర్ శ్మశానవాటిక ఆధునీకరణ, ఇజ్జత్‌నగర్‌లో డ్రెయిన్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం, పీజేఆర్ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ అరేనా అభివృద్ధి వంటి ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. కార్పొరేషన్ పరిపాలన బలోపేతానికి ఒక లీగల్ ఓఎస్డీతోపాటు ముగ్గురు జోనల్ లీగల్ అధికారుల నియామకానికి అనుమతి ఇచ్చారు. స్ట్రక్చరల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, సర్వేయర్, బిల్డర్ లైసెన్సుల జారీ, పునరుద్ధరణ కోసం కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. బహదూర్‌పల్లి జ్యోతిరావు ఫూలే మున్సిపల్ గ్రౌండ్‌లో స్పోర్ట్స్ అరేనా, థీమ్ పార్క్, ఇతర అభివృద్ధి పనులకు కూడా ఆమోదం లభించింది. పారిశుద్ధ్య విభాగంలో నగరవ్యాప్తంగా స్వచ్ఛత ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ బలోపేతానికి ప్రొఫెషనల్ ఏజెన్సీ ఎంపిక కోసం ఈఓఐలు ఆహ్వానించనున్నారు.

మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ అమలు, ఐకియా సమీపంలోని లెగసీ సీ అండ్ డీ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు అవసరమైన ప్రణాళికల‌ను సిద్ధం చేసేందుకు కూడా ప్రత్యేక ఏజెన్సీలను ఎంపిక చేయనున్నారు. అలాగే ఇంజనీరింగ్, విజిలెన్స్ విభాగాల్లో 13 మంది కంప్యూటర్ ఆపరేటర్లను అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమించేందుకు ఆమోదం లభించింది. జీడిమెట్ల వార్డ్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు కేటాయించారు. అయితే సమావేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన నిర్ణయం గచ్చిబౌలిలోని క్యూ-సిటీ జంక్షన్ నుంచి ఐఆర్‌డీఏ జంక్షన్ వరకు ఉన్న యూఎస్ కాన్సులేట్ రోడ్ కు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు మార్చే ప్రతిపాదన. స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ సాధారణ సమావేశంలో స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌లు, క్రీడా మౌలిక వసతులు, థీమ్ పార్క్‌లు, లీగల్ నియామకాలు, సాంకేతిక లైసెన్సింగ్ సంస్కరణలు, జ్యోతిరావు ఫూలే మున్సిపల్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అలాగే 2026 వర్షాకాల అత్యవసర నిర్వహణ కార్యకలాపాల కోసం హైడ్రాకు రూ.20.60 కోట్ల నిధుల మంజూరుపై ప్రభుత్వం మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఉమ్మడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here