శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు చోరీకి గురైన బైక్‌లతో పాటు వాహనాల తాళాలు తెరిచేందుకు ఉపయోగించే పరికరాలు, విడిభాగాలు, 11 నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ఈ ఐదుగురు నిందితులు 2025 డిసెంబర్ నుంచి సైబరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఏసీపీ శ్రీనివాస్ కుమార్, చందానగర్ సీఐ శ్రీధర్‌లు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

చందానగర్‌లోని హుడా కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అడెపు అజయ్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను అక్టోబర్ 25-26 మధ్య రాత్రి ఇంటి ముందు నుంచి దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదుతో చందానగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 1140/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్ 305(బి) ప్రకారం కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ 27న చందానగర్‌లోని ఎంఎంటీఎస్ రోడ్డు సమీపంలో చోరీకి గురైన బైక్‌ను మరో బైక్‌తో లాక్కెళ్తున్న సమయంలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో గడ్డం ప్రవీణ్ (21), బురిడి గోపిచంద్ (20), చోడవరపు దినేశ్ కుమార్ (22), గీసాల శన్ముఖ సత్యసాయి (21), సీరపు దినేశ్ కుమార్ (22) ఉన్నారు. వీరిలో ఒకరు చెన్నైలోని ఎంజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుండగా, మరొకరు రిలయన్స్‌లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ప్రత్యేక పరికరాలు, అదనపు తాళాలు, నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగించి బైక్‌లను దొంగిలించి రాజమండ్రికి తరలిస్తున్నట్లు విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నారు.
నిందితుల నుంచి ప్రస్తుత కేసుకు సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350తోపాటు చందానగర్ పోలీస్ స్టేషన్‌లోని మరో రెండు కేసులకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, క్లాసిక్ 350 బైక్‌లను, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన కేటీఎం 200 డ్యూక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కట్టింగ్ ప్లయర్స్, స్పానర్లు, హ్యాండిల్ లాక్‌లు, పెట్రోల్ ట్యాంక్ లాక్‌లు, ఇతర విడిభాగాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 27 రాత్రి 11.30 గంటలకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన చోరీ వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇతర కేసుల్లో వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసులో కృషి చేసిన చందానగర్ క్రైమ్ టీమ్, సీసీఎస్ ఆర్సీ పురం సిబ్బందిని, ఎస్హెచ్ఓ పర్యవేక్షణలో పనిచేసిన పోలీసులను ఏసీపీ అభినందించారు.





