శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎడుబిల్లి రాజేష్ (25) మృతదేహం లభ్యమైంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో మంగళవారం మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

నాచారంలో నివసిస్తూ కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేష్ కనిపించడం లేదంటూ అతని సోదరి ఎడుబిల్లి సంధ్యారాణి అక్టోబర్ 26న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం.. అదే రోజు తెల్లవారుజామున సుమారు 2 నుంచి 2.30 గంటల మధ్య రాజేష్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న తన స్నేహితుడి గదికి వెళ్లి మద్యం సేవించినట్లు సమాచారం. అనంతరం ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య స్నేహితుడితో కలిసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత రాజేష్ కనిపించకుండా పోవడంతో స్నేహితులు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. DRF బృందాల గాలింపులో రాజేష్ మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు పోస్టుమార్టం పరీక్షల అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





