పెళ్లి చేసుకోవాలని వీడియో కాల్‌లో కోరిన యువతి.. ఫ్లాట్‌లో విగతజీవిగా గుర్తింపు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సహోద్యోగితో గత నాలుగేళ్లుగా ప్రేమ సంబంధంలో ఉన్న ఓ యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్‌ చేసిన కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్‌ చంద్ర నాయక్‌ తండాలోని ఎస్‌ఆర్‌ సద్గురు రెసిడెన్సీలో నివసిస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన తన సహోద్యోగి భండారి విమల్‌తో ఆమె గత నాలుగేళ్లుగా సంబంధంలో ఉన్నట్లు సమాచారం. ఈ సంబంధానికి సంబంధించిన పరిణామాల నేపథ్యంలో విమల్‌ తన భార్య నుంచి విడాకులు పొందేందుకు న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో విమల్‌ తన తల్లితో కలిసి చెర్యాలలో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ సమయంలో అర్చనా అతడికి వీడియో కాల్‌ చేసి, సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీ కట్టి చూపిస్తూ తనను పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ తర్వాత అర్చనా ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడంతో విమల్‌ తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు ఆమె ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. డయల్‌ 112కు కాల్‌ రావడంతో పెట్రోలింగ్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపును బలవంతంగా తెరిచి చూడగా అర్చనా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అనంతరం క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here