మియాపూర్‌లో క్రీడా సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ తనిఖీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ 48 పరిధిలో క్రీడా మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజ‌న‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయ‌ణ్ అమిత్‌, సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ), డిప్యూటీ కమిషనర్ (డీసీ), ఇంజినీరింగ్ విభాగం, ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియాన్ని సందర్శించిన కమిషనర్.. అక్కడి బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, స్కేటింగ్, బాక్సింగ్ కోర్టులను పరిశీలించారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, సదుపాయాల ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా క్రీడా సదుపాయాలను మెరుగ్గా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలోని స్పోర్ట్స్ అరేనాను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న క్రీడా సదుపాయాలను పరిశీలించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని, క్రీడా ప్రాంగణాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జేపీ నగర్‌లోని గురునాథ్ చెరువు సమీపంలో ఉన్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌ను కూడా కమిషనర్ పరిశీలించారు. వర్షపు నీరు నిలిచిపోకుండా, సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువ పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన మరమ్మత్తులు, నిర్వహణ పనులను సకాలంలో చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

నగరంలో క్రీడా సదుపాయాల నిర్వహణతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడం, అవసరమైన నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో ఇంజినీరింగ్ విభాగం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here