శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 9న రాత్రి సుమారు 9.20 గంటల సమయంలో పోలవరపు తేజస్ (22), ప్రైవేట్ ఉద్యోగి, తన స్నేహితుడు దట్టి మోహిత్ (20)తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ (AP 39 DD 1444)పై బిక్షపతినగర్‌లోని ఎస్ఎస్ ప్రీమియం పీజీ నుంచి మెటల్ చార్మినార్ వైపు వెళ్తున్నారు.

మెటల్ చార్మినార్ సమీపంలోకి చేరుకున్న సమయంలో బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న తేజస్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మోహిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజస్ స్వస్థలం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బీఎల్ఎన్ పురం గ్రామంగా పోలీసులు తెలిపారు. ప్రమాదంపై మృతుడి తండ్రి పి. కనకరాజు ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు BNS సెక్షన్లు 306(1), 125(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






