శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనార్బిట్ మాల్ రోడ్‌లోని క్యాపిటల్ ల్యాండ్ గేట్ నెం.03 సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 5న రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో TS34TB2353 నంబర్ గల DCM వాహనాన్ని అనిల్ కుమార్ అరోల్లా అనే వ్యక్తి ర్యాష్‌గా, నిర్లక్ష్యంగా నడిపాడు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న యాక్టివా ద్విచక్ర వాహనంతో పాటు ఇతర వాహనాలను DCM ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదంలో సుమారు ఏడుగురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.1356/2026గా కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లు 125(a), 281 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






