మాదాపూర్‌లో Eagle Team దాడులు.. నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ స్వాధీనం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాలపై మాదాపూర్ పోలీసులు చర్యలు చేపట్టారు. SHO ఆధ్వర్యంలోని Eagle Team విశ్వసనీయ సమాచారం మేరకు సెప్టెంబర్ 7న మెట్రో పిల్లర్ నంబర్ 1762 సమీపంలోని ది స్మోక్ షాప్ లో సోదాలు నిర్వహించింది. సోదాల్లో షాప్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న అబూబకర్ సిద్దీక్ ఎం. (26) నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్, పాడ్స్, కార్ట్రిడ్జ్‌లు, నికోటిన్ పౌచ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 ఈ-సిగరెట్లు, వేప్స్, వాటికి సంబంధించిన ముడి పదార్థాలతో పాటు విక్రయాల ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న రూ.72,500 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, Paytm QR, UPI వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో WhatsApp ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని, QR, UPI ద్వారా చెల్లింపులు స్వీకరించిన అనంతరం Rapido, Porter వంటి డెలివరీ సేవల ద్వారా వేప్స్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో Porter లావాదేవీలకు సంబంధించిన వివరాలతోపాటు వేప్స్ విక్రయాలపై కొంతమంది వ్యక్తులతో జరిపిన WhatsApp చాట్స్‌ను పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో షాప్ యజమాని అబ్దుల్ సఫ్వాన్, ఉద్యోగి అబూబకర్ సిద్దీక్ ఎం.తో పాటు సరఫరాదారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా మైనర్లకు నిషేధిత వేప్స్ విక్రయించారా అనే అంశంపైనా పోలీసులు విచారణ చేపట్టారు. నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ నిల్వ చేయడం, విక్రయించడం, సరఫరా చేయడంపై కఠిన చర్యలు కొనసాగిస్తామని మాదాపూర్ పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here