శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల డివిజన్ గోపన్ పల్లి, తాజ్ నగర్, ఎన్‌టీఆర్ నగర్, సోఫియా కాలనీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ విజయ గణపతి స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మహోత్సవం ముగింపు రోజైన ఆదివారం ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమై, ఉదయం 9.38 గంటలకు స్వామివార్ల ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్-105 మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలకృష్ణ, వెంకట్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్ రావు, మోహన్ నాయక్, శేఖర్, శంకరి రాజు ముదిరాజ్, భీమ్‌రాజ్, ఈ. నరసింహ, యాదయ్య, రమేష్, బద్రి, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





