శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలోని TN నగర్, FCI, Widea కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులతో నేరుగా మాట్లాడి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, అధ్వానంగా మారిన రోడ్లు, వీధి దీపాల కొరత వంటి సమస్యలను రామప్రభు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలను విన్న రామప్రభు మాట్లాడుతూ.. ప్రజలకు అండగా తాను ఉంటానని తెలిపారు. రోజువారీ రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లపై అవసరమైన తాత్కాలిక మరమ్మత్తులు, లెవలింగ్ పనులను సొంత ఖర్చులతో చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వీధి దీపాల సమస్యను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తానన్నారు. డ్రైనేజీ, శాశ్వత రోడ్ల నిర్మాణం వంటి ప్రభుత్వ పరిధిలోని పనులను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాలనీల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
కాలనీల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రామప్రభు కోరారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలపై కేవలం హామీలు ఇవ్వకుండా, తన పరిధిలో ఉన్న పనులను వెంటనే చేపట్టి, మిగతా సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ARP టీమ్ సభ్యులు, TN నగర్, FCI, Widea కాలనీ వాసులు పాల్గొన్నారు.





