శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): గురుపౌర్ణమి శుభసందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ, జనప్రియ వెస్ట్ సిటీ, ఎంఏ నగర్, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీల్లోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను స్మరించి పూజించే పవిత్ర దినమే గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూజలు నిర్వహించి గురువులను సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందడం భారతీయ సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు.

సద్గురువుల ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని శ్రీ షిర్డీ సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో ఆధ్యాత్మికత, సేవాభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాలు చౌదరి, సాంబయ్య, రాజేశ్వరి, నరేష్ చౌదరి, సందీప్ రెడ్డి, కృష్ణ, బాలింగ్ వెంకటేష్ గౌడ్, శివ, తిమ్మరాజు, నాగులు, దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీల పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





