శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్‌లో నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ వద్ద భారీ వర్షాల నేపథ్యంలో కాలువలో వ్యక్తి గల్లంతైన ఘటనపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు, సీఎంసీ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తంగా ఉంటే వర్షాకాలంలో ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.

గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించి, నిర్మాణ దశలో ఉన్న లోతట్టు ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కాలువలో పడిన వ్యక్తి గల్లంతయ్యాడని పేర్కొంటూ, స్థానికులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని జగదీశ్వర్ గౌడ్ వెల్లడించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు ముదిరాజ్, రవీందర్ రెడ్డి, మన్నేపల్లి సాంబశివరావు, కట్ల శేఖర్ రెడ్డి, నర్సింగ్ రావు, కృష్ణ గౌడ్, రామచందర్, భరత్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.





