శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ విలేజ్ ప్రధాన రహదారిని అత్యవసరంగా పునర్నిర్మించి కొత్త రోడ్డు నిర్మించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు సి.ఎం.సి. మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎన్‌హెచ్-65 నుంచి మదీనాగూడ విలేజ్ ప్రధాన రహదారి మీదుగా మంజీర ఫైవ్ లైన్ రోడ్డు వరకు ఉన్న కనెక్టివిటీ రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున వెంటనే నాణ్యమైన రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని వారు కోరారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బోయిని మహేష్ యాదవ్, ఆది పవన్ కుమార్, అంకనిపల్లి సురేష్ కురుమ మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రహదారిని తవ్విన తర్వాత దానిని సరిగా పునరుద్ధరించకపోవడంతో ప్రస్తుతం రోడ్డు గుంతలమయంగా మారిందని తెలిపారు. ఈ రహదారిపై ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, వందలాది మంది వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, స్కూల్ బస్సులు, మహిళలు, వృద్ధులు ప్రయాణిస్తున్నారని, దెబ్బతిన్న రహదారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటం, బురద పేరుకుపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల భద్రత, రాకపోకల సౌలభ్యం దృష్ట్యా సంబంధిత అధికారులు తక్షణమే రహదారిని పరిశీలించి, ఎన్‌హెచ్-65 నుంచి మంజీర ఫైవ్ లైన్ రోడ్డు వరకు ఉన్న మదీనాగూడ ప్రధాన రహదారిపై నాణ్యమైన కొత్త రోడ్డు నిర్మాణ పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.





