శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): చిత్రలేఖనంలో ఐదున్నరేళ్ల బాలుడు వేదార్త్ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 1 గంట 15 నిమిషాల్లో ఏనుగు థీమ్‌పై 50 విభిన్న చిత్రాలను గీసి విశ్వగురు వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. నిజాంపేట్‌కు చెందిన డాక్టర్ ఉప్పల మణికంఠ, డాక్టర్ శ్రీలత దంపతుల కుమారుడైన వేదార్త్, నిజాంపేట్‌లోని కేపీఆర్ దివ్య ప్రభాస్ ఎన్‌క్లేవ్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థి వేదార్త్, ప్రత్యక్షంగా 50 రకాల ఏనుగు చిత్రాలను గీసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. వేదార్త్ ప్రతిభను పరిశీలించిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ఈ ఘనతను అధికారికంగా విశ్వగురు వరల్డ్ రికార్డుగా నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం మాట్లాడుతూ వేదార్త్ గీసిన ప్రతి చిత్రంలో భావవ్యక్తీకరణ, సృజనాత్మకత అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు, డాక్టర్ సారంగపాణి, ప్రముఖ చిత్రకారుడు సురేష్, ప్రముఖ వాస్తు నిపుణుడు, ఈనాడు కాలమిస్ట్ కృష్ణాది శేషు, హైకోర్టు న్యాయవాది సీహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేదికపై వేదార్త్ ఏకాగ్రతతో వరుసగా 50 చిత్రాలను పూర్తి చేయడం అతిథులు, కళాభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్న వయసులోనే అసాధారణ చిత్రకళా ప్రతిభ కనబరిచిన వేదార్త్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని అతిథులు ఆకాంక్షించారు.






