శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీకి చెందిన నాగభూషణ రావు అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కు దరఖాస్తు చేసుకోగా, సీఎం రిలీఫ్ ఫండ్ LOC ద్వారా రూ.2.50 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన CMRF-LOC పత్రాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా నిరంతరం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.

అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నహస్తంలా నిలుస్తోందని, అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన వివరించారు. వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





