శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని ఓటరు జాబితా నవీకరణకు సహకరించాలని కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. SIR కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్యుమరేషన్ కేంద్రాలను హమీద్ పటేల్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం, ఓటర్ల వివరాలను సేకరించడం, ప్రజలతో సమన్వయం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి అయోమయాలకు తావు లేకుండా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఎన్యుమరేషన్ పనుల పురోగతిని సమీక్షించి, ఇప్పటివరకు సేకరించిన ఫారాల సంఖ్య, పెండింగ్లో ఉన్న ఇళ్ల వివరాలను BLOల నుంచి తెలుసుకున్నారు.

నిర్దేశిత గడువులోగా 100 శాతం కవరేజ్ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న BLOలు ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, వారికి ఎదురయ్యే సమస్యలు, సందేహాలను నివృత్తి చేస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందించాలని కోరారు. సేకరించిన దరఖాస్తులను అదే రోజు డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని BLOలు, సూపర్వైజర్లకు సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సరైన వివరాలతో ఓటరు జాబితా సిద్ధమైతే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఇంటింటికి వచ్చే BLOలకు అవసరమైన సమాచారం, సంబంధిత పత్రాలు అందించి సహకరించాలని ప్రజలను కోరారు. పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో మార్పులు ఉన్న వారు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా వాటిని సరిచేసుకోవాలని సూచించిన ఆయన, ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.





