శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. బీఎల్ఓల పనితీరును సమీక్షించి, స్థానిక ప్రజలకు ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి, సంతకం చేసి తప్పనిసరిగా బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించినప్పుడే ఓటు నమోదు ప్రక్రియ పూర్తవుతుందని, ఫారం ఇవ్వని వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు అని పేర్కొన్న గాంధీ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడం తమ సామాజిక బాధ్యత అని అన్నారు. SIR కార్యక్రమంలో పాల్గొని జూలై 24లోగా ఫారాలు సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేద, మధ్యతరగతి ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున స్పందిస్తున్నప్పటికీ, హైరైజ్ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో బీఎల్ఓలకు ప్రవేశం లభించకపోవడం, ఫారాలు ఆలస్యంగా అందడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఓటరు నమోదు లేకపోతే అనేక పరిపాలనా, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. బీఎల్ఓలు ఇంటింటికీ మూడు దఫాలు వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి తిరిగి స్వీకరిస్తారని, ఫారం సమర్పించిన తర్వాత తప్పనిసరిగా అక్‌నాలెడ్జ్‌మెంట్ రసీదు తీసుకోవాలని చెప్పారు.
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం ఎన్నికల నమోదు అధికారులు నోటీసులు జారీ చేస్తే, అవసరమైన గుర్తింపు పత్రాలు సమర్పించి అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు, పెన్షన్ పత్రాలు, పాస్‌పోర్ట్, విద్యా ధ్రువపత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, కుటుంబ నమోదు పత్రం, భూమి లేదా గృహ కేటాయింపు పత్రాలు వంటి పలు పత్రాలను గుర్తింపుగా పరిగణిస్తామని వివరించారు. ఫారం సమర్పించే ముందు తాజా ఫోటో, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, కుటుంబ వివరాలు, సంతకం వంటి అంశాలను సరిచూసుకోవాలని, ఫారం సమర్పించిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకుని దానిని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు, మంత్రి ప్రగడ సత్యనారాయణ, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





