శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు సంబంధిత విభాగాల అధికారులు శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నార్సింగి వార్డును సందర్శించి పౌర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, స్థానిక ప్రజలతో కమిషనర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, చెరువుల అభివృద్ధి, రహదారులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముస్కిన్ చెరువులోకి చేరుతున్న మురుగునీటిని మళ్లించడం, చెరువు పునరుద్ధరణ, ఎటికిన్ చెరువు అభివృద్ధి, సుందరీకరణ, వీధుల స్వీపింగ్ సేవల మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, దోమల నివారణ, వీధి కుక్కల నియంత్రణ వంటి సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

అదే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయడం, ఎస్‌ఎన్‌డీపీ (SNDP) పథకం కింద స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల రీమోడలింగ్, వివిధ కాలనీల్లో బీటీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టాలని కోరారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో పారిశుధ్య సేవలను బలోపేతం చేయడం, Accurate Wind Chimes సమీపంలో యూ-టర్న్ ఏర్పాటు, రహదారులు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించడం, అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను పరిశీలించిన కమిషనర్, సంబంధిత శాఖలు, లైన్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని ప్రాధాన్యతా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వార్డు స్థాయి ప్రాధాన్యతల ఆధారంగా త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టడమే లక్ష్యమని కమిషనర్ తెలిపారు.





