శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ ఫెయిర్ ప్రైస్ షాప్ (F.P.S.) నెం. 1581409లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. రేషన్ డీలర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ఒక్కో రేషన్ కార్డు నుంచి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త ఎం.డి. అక్తర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్థానికులు రేషన్ షాప్‌ను సందర్శించి డీలర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు షాప్ ఎదుట చేరుకుని డీలర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రేషన్ లబ్ధిదారులకు పురుగులు పట్టిన, నాసిరకం బియ్యం పంపిణీ చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన ప్రజలతో డీలర్ తండ్రి అనుచితంగా ప్రవర్తించారని కూడా వారు పేర్కొన్నారు.

ప్రజల ఆరోపణల ప్రకారం, షాపు ఒకరి పేరుపై ఉండగా నిర్వహణ మాత్రం మరొకరు చేపడుతున్నారని తెలిపారు. ఈ రేషన్ షాప్‌పై గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ లైసెన్స్‌ను వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు, అక్రమ వసూళ్లు, నాసిరకం రేషన్ పంపిణీ, ప్రజలను మోసం చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చే వారిని ఉపేక్షించరాదని, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక కార్యకర్త ఎం.డి. అక్తర్ కోరారు.





