శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం గడువు పెంపుపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్, పాపిరెడ్డి నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో కలిసి ఓటర్లను కలుసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం పొడిగించిన గడువును ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా కృషి చేయాలని ఆయన సూచించారు.

అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో BLOలు అన్ని రాజకీయ పార్టీల BLAలతో సమన్వయంగా పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని అన్నారు. ఓటర్లు ఫారాలను పూర్తిగా నింపి, అవసరమైన ప్రభుత్వ గుర్తింపు పత్రాలతో కలిసి తిరిగి BLOలకు అందజేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో BLOలు ఒకే చోట కూర్చుని ఫారాలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, అలాంటి విధానం సరికాదన్నారు. ప్రతి ఇంటిని సందర్శించినప్పుడే నిజమైన అర్హులైన ఓటర్లను గుర్తించే అవకాశం ఉంటుందని, తద్వారా డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రతి రోజు ఎన్ని ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారో, ఎన్ని పూర్తి చేసిన ఫారాలు తిరిగి స్వీకరిస్తున్నారో, అలాగే ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల వివరాలను BLOల నుంచి సేకరించి పార్టీ నాయకత్వానికి తెలియజేయాలని బీజేపీ BLAలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, గోపాల్ రావు, నర్సింగ్ రావు, బాలు యాదవ్, రాజు, భూపాల్ రెడ్డి, దుర్గాప్రసాద్, రామరాజు, రామ్ రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, నర్సింగ్ యాదవ్, లలితా రెడ్డి, మమత, రేణుక తదితరులు పాల్గొన్నారు.





