శేరిలింగంపల్లి, జూలై 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఆర్ ఎస్టేట్స్‌లో ఉన్న గంగాధర శాస్త్రి, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రసాద్స్ ఫౌండేషన్ చైర్మన్ డి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, దోనేపూడి రమాదేవి దంపతులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా దుర్గా సూక్తాభిషేకం, లలితా సహస్రనామ పూర్వక కుంకుమార్చన, రాజశ్యామల అమ్మవారి మూలమంత్ర హోమం, మహా మంగళనీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి వచనం తదితర విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగ హోమం నిర్వహించే అవకాశం దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నామని డి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, దోనేపూడి రమాదేవి దంపతులు తెలిపారు. అనంతరం వేద పండితులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లకు వేద ఆశీర్వచనాలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల యాగ హోమం నిర్వహించిన డి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ దంపతులను ఆరెకపూడి గాంధీ ఆశీర్వదించారు. అలాగే నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న గంగాధర శాస్త్రి దంపతులు, వేద పండితులను శాలువాలతో సత్కరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చక్రపాణి, రావెళ్ల శ్రీనివాస్, గాయత్రి, రాజేశ్వరి, వసుమతి, మంజుల, పద్మశ్రీ, లిఖిత, శాంతి, ఈశ్వరి, విజితతోపాటు ఎస్‌ఆర్ ఎస్టేట్స్ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





