గౌలిదొడ్డి-విప్రో సర్కిల్ రోడ్డు విస్తరణ వేగవంతం చేయాలి: గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూలై 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కేశవ్‌నగర్‌లోని గోసాయి కుంట చెరువు, గౌలిదొడ్డి ప్రాంతాల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ సేవ ఎస్లావత్ నాయక్, జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రజల తరఫున పలు అభివృద్ధి ప్రతిపాదనలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గోసాయి కుంట చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన కోరారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు, విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే చిన్నారుల కోసం ఆధునిక ఆట స్థలాలు, వృద్ధుల కోసం విశ్రాంతి కేంద్రాలు, ఓపెన్ జిమ్, హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం, పార్కింగ్ వంటి వసతులు కల్పించి గోసాయి కుంటను నగర ప్రజలకు ఆదర్శవంతమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. అదేవిధంగా గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్ వరకు రహదారిని అత్యవసరంగా విస్తరించాలని గంగాధర్ రెడ్డి కోరారు. రోడ్డు విస్తరణతోపాటు పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్, ఆధునిక వీధి దీపాలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, అవసరమైన జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారిని విస్తృతంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యటన అనంతరం గోసాయి కుంట చెరువును పరిశీలించిన కమిషనర్ సృజన చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు, పచ్చదనం, ఆధునిక సౌకర్యాలతో సమగ్ర అభివృద్ధి చేపట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు.

అలాగే గౌలిదొడ్డి-విప్రో సర్కిల్ రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యం – సమగ్ర అభివృద్ధే లక్ష్యం అనే సంకల్పంతో గచ్చిబౌలి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి కొనసాగుతుందని మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టీజీటీఎస్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్, ఎస్‌ఈ శంకర్ నాయక్, జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఈఈ శిరీష, ఏఈ భాస్కర్, సీనియర్ నాయకులు కిషన్, గోలి తిరుపతి, ప్రసాద్, రాజు, శ్రీను, యాదయ్య, గోవింద్ నగేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here