శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషాముళ్ళపూడి కమాన్ నుంచి గాజులరామారం వరకు, ఎల్లమ్మబండ మీదుగా చేపడుతున్న 100 అడుగుల ప్రధాన రహదారి విస్తరణ పనులను మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉషాముళ్ళపూడి కమాన్ నుంచి గాజులరామారం వెళ్లే మార్గంలో నిత్యం తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు.

రోడ్డు విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు గతంలోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ వివిధ శాఖల అధికారులతో సమావేశమై కార్యాచరణ రూపొందించారని, అదే ప్రణాళిక ప్రకారం ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పనుల్లో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్న భారీ బండరాళ్ల తొలగింపు, అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ స్తంభాల స్థానభ్రంశం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 100 అడుగుల రోడ్డు విస్తరణ పూర్తయితే ఆల్విన్ కాలనీ, శంషీషిగూడ ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి, మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వెంకటేష్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, గోపాల్, జిల్లా గణేష్, ఇస్మాయిల్, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, నాగేష్ గౌడ్, రవీందర్, ఖలీమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





