శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హిసార్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు పలు రైళ్లకు హాల్ట్ కల్పించాలని, హిసార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను డైలీ సర్వీస్‌గా మార్చాలని, అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్ తరహాలో జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ రైల్వే అధికారులను కోరారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవతో దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ. శ్రీధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు, భారీ నివాస సముదాయాలు పెరగడంతో శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో లింగంపల్లి స్టేషన్‌లో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించడం, హిసార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రోజువారీ రైలుగా మార్చడం, స్టేషన్‌ను జంక్షన్‌గా అభివృద్ధి చేయడం అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. రైల్వే అధికారులు సమస్యలను సానుకూలంగా స్వీకరించి, సాధ్యమైన మేరకు అన్ని అంశాలపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినట్లు రవికుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్‌తోపాటు జలంధర్ రెడ్డి, రాంబాబు, బాలాజీ, అశోక్ పారికర్, దొరబాబు, సుందర్ లాల్, కృష్ణమూర్తి, అజయ్ గుప్తా, రాజేంద్ర కుమార్ తివారి, వినోద్ కుమార్ జోషి తదితరులు పాల్గొన్నారు.





