శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): తెలంగాణలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆరోపిస్తూ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న కేజీ నుంచి పీజీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు AIFDS గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ముత్తనగారి శ్రీకాంత్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానంగా ఖాళీ పోస్టుల భర్తీ, విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సౌకర్యాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ, మహిళా విద్యార్థుల భద్రత కోసం ఐసీసీ కమిటీల ఏర్పాటు, విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణ, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం, NEP-2020 అమలు నిలిపివేత వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. జూలై 10న నిర్వహించే బంద్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని AIFDS గ్రేటర్ హైదరాబాద్ కమిటీ హెచ్చరించింది.






