నిజాంపేట్‌లో శ్రీ వెంకటేశ్వరస్వామికి ఘ‌నంగా జ్యేష్టాభిషేకం

శేరిలింగంపల్లి, జూన్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డులో ఉన్న సెవెన్ హిల్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో 1008 కలశాలతో నిర్వహించిన శ్రీ వారి సహస్ర కలశాభిషేకం, జ్యేష్టాభిషేకం కార్యక్రమం భక్తిశ్రద్ధల న‌డుమ‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ఈఓ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జ్యేష్ఠ మాసంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారికి నిర్వహించే జ్యేష్టాభిషేకం అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని తెలిపారు.

పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసం, ఫలహారాలు, జాజికాయ, లవంగాలు, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరం, కస్తూరి తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా ప్రజలందరిపై శ్రీ వెంకటేశ్వరస్వామి కృప, ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here