శేరిలింగంపల్లి, జూన్15 (నమస్తే శేరిలింగంపల్లి): జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపు మేరకు నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల కిషోర్ కుమార్ రెడ్‌క్రాస్ ప్యాట్రన్ మెంబర్‌గా సభ్యత్వం పొందారు. రూ.25 వేల విరాళం చెల్లించి ప్యాట్రన్ మెంబర్‌గా చేరిన ఆయనకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సభ్యత్వ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ విద్యా, ధార్మిక రంగాల్లో అందిస్తున్న సేవలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. సమాజ సేవకు రెడ్‌క్రాస్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు. జిల్లాలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకుంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రశంసించారు. అలాగే వారిని ప్రోత్సహిస్తున్న పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకత్వాన్ని అభినందించారు.

జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ డా. శశికుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అల్లాపూర్ కుశాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





